రియల్‌ బాహుబలి…ప్రాణాలకు తెగించి అడవి పందితో పోరాడిన ఆదిలాబాద్‌ రైతు

రైతుకు ప్రధాన శత్రువుల్లో అడవి పంది ఓకటి. చేతికోచ్చిన పంటను సైతం నిమిషాల్లో పాడు చేసి రైతులకు నిద్ర లేకుండా చేస్తాయి అడవి పందులు. అలాంటి పందులపై ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ గిరిజనుడు బాహుబలిలా విరుచుకుపడి అడవి పందిని మట్టికరిపించాడు. అలాంటి క్రూర జంతువుతో పోరాడాడు ఈ రైతన్న బోథ్‌ మండలం సంపత్‌నాయక్‌ తండాలో తన పత్తి పంటను పరిశీలించేందుకు వెళ్లిన రైతు కచ్వ జైసింగ్‌ పై ఆకస్మికంగా అడవి పంది దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన జైసింగ్‌ అడవి పంది నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అడవి పంది పదేపదే రైతుపై విరుచుకుపడటంతో మరో దారిలేక తిరగబడ్డాడు.

రైతు జైసింగ్‌ అడవి పంది మధ్య కొద్దిసేపు హోరాహోరీ పోరు జరిగింది. తీవ్ర గాయాలతో రక్తం కారుతున్నా భీతిల్లికుండా అడవి పందితో పోరాడాడు. చివరికి అడవి పంది మెడను దొరకబట్టుకొని పట్టువదలకుండా గట్టిగా నొక్కి పట్టుకోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్ర గాయాలపాలైన రైతును గమనించిన స్థానికులు అతడ్ని ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. భయపడకుండా అడవి పందితో హోరా హోరిగా పోరాడి ఆ పందిని మట్టికరిపించి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న జైసింగ్‌ ధైర్యసాహసాలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.